చిల్లర వివాదం.. మహిళా కండక్టర్ ప్రాణం బలి!
బస్సులో నుంచి కిందకు నెట్టివేత.. పది రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూత
మణుగూరు/నవోదయం:
చిన్నపాటి చిల్లర వివాదం చివరకు ఓ మహిళా ఆర్టీసీ కండక్టర్ ప్రాణాలను బలిగొంది. టికెట్‌కు సంబంధించిన మిగిలిన చిల్లర వెంటనే ఇవ్వాలంటూ ప్రయాణికురాలు చేసిన గొడవ తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్‌ను బస్సులో నుంచి కిందకు నెట్టివేయడంతో తీవ్రంగా గాయపడిన ఆమె.. పది రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
అసలేం జరిగిందంటే..
వివరాల్లోకి వెళితే.. మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) గత నెల 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్లే ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అశ్వాపురం మండలం పరిధికి చెందిన బానోత్ మౌనిక తన కుమారుడితో కలిసి బస్సు ఎక్కింది. కుమారుడి టికెట్ కోసం కండక్టర్ ప్రవళికకు రూ.100 నోటు ఇచ్చింది. టికెట్ జారీ చేసిన కండక్టర్ మిగిలిన చిల్లరను వెంటనే ఇవ్వలేకపోవడంతో టికెట్ వెనుక రాసి ఇచ్చినట్లు సమాచారం.
అయితే తనకు రావాల్సిన చిల్లర వెంటనే ఇవ్వాలంటూ మౌనిక పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. బస్సు అశ్వాపురం మండలం మిట్టగూడెం సమీపానికి చేరుకున్న సమయంలో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ప్రయాణికురాలు కండక్టర్ ప్రవళికను బస్సులో నుంచి కిందకు తోసివేసినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
వెనుక చక్రాల కింద పడి తీవ్ర గాయాలు..
కదులుతున్న బస్సు నుంచి కిందపడిన ప్రవళికపై వెనుక చక్రాలు వెళ్లడంతో ఆమె కాళ్లు తీవ్రంగా నుజ్జునుజ్జయ్యాయి. వెంటనే ఆమెను భద్రాచలం ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ సుమారు పది రోజుల పాటు వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు.
విధుల్లో చేరిన పది నెలలకే విషాదం..
ప్రవళిక తండ్రి నాగరాజు గతంలో ఆర్టీసీలో మెకానిక్‌గా పనిచేశారు. ఆయన మరణానంతరం వారసత్వంగా ప్రవళికకు సుమారు పది నెలల క్రితం కండక్టర్ ఉద్యోగం లభించింది. చిన్న వయసులోనే ఉద్యోగ బాధ్యతలు చేపట్టి కుటుంబానికి అండగా నిలుస్తున్న ఆమె.. మరో రెండు నెలల్లో వివాహం చేసుకోబోతున్న తరుణంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ..
ప్రవళిక మృతిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున రూ.10 లక్షల ఆర్థిక సహాయం, ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కల్పిస్తామని ప్రకటించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
చిల్లర విషయంలో మొదలైన చిన్నపాటి వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ప్రజలకు సేవలందించే ఆర్టీసీ ఉద్యోగుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.
Telangana
చిల్లర వివాదం.. మహిళా కండక్టర్ ప్రాణం బలి
Quick Summary:
చిల్లర వివాదం.. మహిళా కండక్టర్ ప్రాణం బలి