ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం: కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్/నవోదయం : ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు.
దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను వివరించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర మంత్రికి వివరణాత్మక వినతిపత్రాన్ని అందజేశారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని సీఎం తెలిపారు. తాగునీరు, విద్యుత్ కొరత ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించారు.
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరారు. ఇందులో భాగంగా 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్లు, కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
PMAY-G ఇళ్లపై కేంద్రానికి విజ్ఞప్తి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) కింద తెలంగాణకు తొలి విడతగా 2 లక్షల ఇళ్లను కేటాయించినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 11,56,915 అర్హత కలిగిన గ్రామీణ కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని గత జూలైలో ఢిల్లీలో కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు.
రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కూడా కేటాయించాలని శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ముఖ్యమంత్రి కోరారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని సీఎం తెలిపారు. అలాగే సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు వివరించారు.
Telangana
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం: కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Quick Summary:
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం: కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి