ప్రజాభద్రత–పోలీసు బాధ్యతపై కిష్టారం గ్రామంలో అవగాహన కార్యక్రమం
సామాజిక అంశాలపై ఆటపాటలతో ప్రజలకు అవగాహన కల్పించిన సురక్ష పోలీసు కళాబృందం
జడ్చర్ల: ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంచడంతో పాటు నేరాల నివారణ, మహిళలు–బాలికల భద్రత, సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు “ప్రజాభద్రత–పోలీసు బాధ్యత” కార్యక్రమాన్ని నిర్వహించారు.
మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి IPS ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారం గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. సురక్ష పోలీసు కళాబృందం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) సభ్యులు ఆటపాటలు, మాటల ద్వారా గ్రామ ప్రజలకు పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జడ్చర్ల ఎస్సై అక్షయ్ దీప్ మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంతో పాటు చట్టాలపై అవగాహన కల్పించడం, నేరాల నివారణలో ప్రజలను భాగస్వాములను చేయడం పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు.
“పోలీసుల ఉనికి ప్రజల భద్రత కోసమే” అని పేర్కొంటూ, చట్టపరంగా జీవించే వారు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. వర్గాలుగా విడిపోయి గొడవలకు పాల్పడటం సమాజ అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని, అసాంఘిక శక్తులను కట్టడి చేసేందుకు పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు.
రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు పోలీసు రికార్డులో ఉండటం వల్ల వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. కేసుల్లో ఇరుక్కుంటే ఉద్యోగాలు, పాస్‌పోర్టు, విదేశీ అవకాశాలు వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని యువతను హెచ్చరించారు.
మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక అవగాహన
మహిళలు, బాలికలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్సై అక్షయ్ దీప్ అన్నారు. బాలికలు చదువుకునే వయసులో చిన్నచిన్న ఆకర్షణలకు లోనై తమ విద్య, భవిష్యత్తును నష్టపరుచుకోవద్దని సూచించారు. మహిళలు, విద్యార్థినులపై వేధింపులు జరిగితే షీటీమ్‌ను సంప్రదించాలని, బాధిత మహిళలు, బాలికలకు సఖీ సెంటర్ల ద్వారా అవసరమైన సహాయం, మానసిక భరోసా అందిస్తున్నట్లు తెలిపారు.
మానవ అక్రమ రవాణా, నిర్బంధ కార్మిక వ్యవస్థ, అక్రమ దత్తత వంటి అంశాలపై సమాచారం ఉంటే 8712680066 నంబర్‌కు, అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళలు, బాలికల వేధింపులకు సంబంధించిన సమాచారాన్ని 8712659365కు అందించి సహాయం పొందవచ్చని తెలిపారు.
సైబర్ మోసాలు, మాదకద్రవ్యాలపై హెచ్చరిక
“సైబర్ మోసాలకు లొంగకండి.. అత్యాశకు బలి కాకండి” అని పోలీసులు ప్రజలకు సూచించారు. సైబర్ మోసానికి గురై ఆర్థికంగా నష్టపోయిన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని తెలిపారు.
డ్రగ్స్, గంజాయి, మద్యం, పేకాట వంటి చెడు అలవాట్లు జీవితాలను నాశనం చేస్తాయని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల తయారీ, రవాణా, సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే 1908కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు, పెద్దలు వారికి ఆదర్శంగా నిలవాలని కోరారు.
మహబూబ్‌నగర్ జిల్లాను నేర రహిత జిల్లాగా మార్చాలన్న జిల్లా ఎస్పీ డి. జానకి IPS సంకల్పాన్ని ప్రజలకు వివరించారు. ప్రజలు–పోలీసుల భాగస్వామ్యంతో సమాజంలో శాంతిభద్రతలు మరింత మెరుగుపడతాయని, ఏవైనా సమస్యలు ఎదురైతే నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి సుజాత గోపాల్ రెడ్డి, ఏఎస్ఐ రమేష్, పాత్రికేయులు డేవిడ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
AHTU సభ్యులు సక్రి ఏఎస్ఐ, జ్యోతి హెచ్‌సీ, సురక్ష పోలీసు కళాబృందం సభ్యులు డి. రాములు హెచ్‌సీ, డి. జగదీశ్ పీసీ, బాల్ రాజు తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.
Telangana
ప్రజాభద్రత–పోలీసు బాధ్యతపై కిష్టారం గ్రామంలో అవగాహన కార్యక్రమం
Quick Summary:
ప్రజాభద్రత–పోలీసు బాధ్యతపై కిష్టారం గ్రామంలో అవగాహన కార్యక్రమం



