గణేష్ నిమజ్జనం సందర్భంగా DJ సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదు
శాంతి భద్రతలు, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, IPS
గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజల శాంతి భద్రతలు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడం, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం లక్ష్యంగా మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖ పలు ముందస్తు చర్యలు చేపడుతోంది.
శబ్ద కాలుష్య నియంత్రణకు సంబంధించి గౌరవ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు, ఆదేశాలు మరియు అమలులో ఉన్న చట్టపరమైన నిబంధనల మేరకు మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో గణేష్ నిమజ్జనం ఊరేగింపుల్లో DJ SOUND SYSTEM వినియోగానికి ఎటువంటి అనుమతి ఇవ్వబడదు. సుప్రీంకోర్టు కూడా ఇతరులకు తీవ్ర శబ్ద కాలుష్యం కలిగించడం అనుమతించరాదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో గణేష్ ఉత్సవాల నిర్వాహకులు, DJ ఆపరేటర్లు పోలీసుల సూచనలు మరియు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అనుమతి లేకుండా DJ వినియోగించడం, అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగించడం లేదా పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించడం జరిగితే సంబంధిత నిర్వాహకులు (Organisers) మరియు DJ ఆపరేటర్లపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి.
*ప్రజల ఆరోగ్యం కూడా మనందరి బాధ్యత*
అధిక శబ్దం వల్ల ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు మరియు ఇతర సున్నిత వర్గాల ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. గణేష్ నిమజ్జన వేడుకల సమయంలో అధిక శబ్దం, డ్యాన్స్ మరియు భారీ జనసమ్మర్థంతో ఆరోగ్య సమస్యలు తలెత్తిన ఘటనలు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో నమోదైనట్లు వార్తలు వెలువడ్డాయి.
అందువల్ల వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా పోలీసు శాఖ సూచిస్తోంది.
*నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు*
1. పోలీసుల సూచించిన నిమజ్జన మార్గం మరియు సమయాలను తప్పనిసరిగా పాటించాలి.
2. ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా నిర్వాహకులు స్వచ్ఛంద సేవకులను ఏర్పాటు చేసుకోవాలి.
3. విద్యుత్ వైర్లు, ట్రాఫిక్, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
4. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారి భద్రతకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
5. మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం, పోలీసులతో వాగ్వాదానికి దిగడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి.
6. అనుమతి లేని DJలు లేదా అధిక శబ్దాన్ని కలిగించే సౌండ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయకూడదు
7. ఏదైనా అనుమానాస్పద వ్యక్తి, వస్తువు లేదా అవాంఛనీయ పరిస్థితి కనిపిస్తే వెంటనే సమీప పోలీసులకు, జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ 8712659360 లేదా 112 కి సమాచారం అందించాలి.
జిల్లాలో గణేష్ ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని అవసరమైన భద్రతా చర్యలు చేపడుతోంది. తెలంగాణలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇతర పోలీసు విభాగాలు కూడా DJలను అనుమతించకుండా, శబ్ద నియంత్రణ మరియు ప్రజా భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను అమలు చేస్తున్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు, గణేష్ ఉత్సవాల నిర్వాహకులు పోలీసు శాఖకు సహకరించి, నిబంధనలను పాటించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా మరియు విజయవంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, IPS గారు విజ్ఞప్తి చేశారు.
Telangana
గణేష్ నిమజ్జనం సందర్భంగా DJ సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదు
Quick Summary:
గణేష్ నిమజ్జనం సందర్భంగా DJ సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదు
