మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ నిరంతర నిఘా
మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు
మహిళల భద్రతే లక్ష్యం – వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు
విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్స్ నిఘా
జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్
మహబూబ్ నగర్/నవోదయం :
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ తెలిపారు. మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్, మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలను అరికట్టేందుకు షీ టీమ్స్, AHTU బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
*అక్టోబర్ నెలలో షీ టీమ్స్ చర్యలు*
అక్టోబర్ నెలలో షీ టీమ్స్‌కు మొత్తం 20 ఫిర్యాదులు అందగా, వాటిలో 9 కౌన్సెలింగ్‌లు, 10 ఈ-పెట్టి కేసులు, ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదేవిధంగా 16 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 20 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు 50 హాట్‌స్పాట్ ప్రాంతాలను సందర్శించి నిఘా ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలలో విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో చట్టం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగం, స్వీయ రక్షణ, డయల్ 112 ప్రాముఖ్యత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
*మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక చర్యలు*
AHTU బృందం, సురక్ష పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో 17 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ ఎక్కువగా జరిగే 65 హాట్‌స్పాట్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, పిల్లల అక్రమ దత్తత, మానవ అవయవాల అక్రమ విక్రయం, మహిళలు మరియు బాలికలపై జరిగే నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే సంబంధిత యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లలను దత్తత తీసుకోవాలనుకునేవారు CARA వెబ్సైట్ ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే దత్తత ప్రక్రియ చేపట్టాలని సూచించారు.
*బాధితులకు అండగా పోలీసుల తక్షణ స్పందన*
అక్టోబర్ నెలలో జడ్చర్ల పట్టణంలోని ఒక లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
అదేవిధంగా మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన 17 సంవత్సరాల అనాథ బాలుడిని గుర్తించి DCPO సహకారంతో హాస్టల్లో చేర్పించారు. మరో ఘటనలో పాఠశాలకు వెళ్లకుండా పనిలోకి రావాలని ఇద్దరు పిల్లలను వేధిస్తున్న యజమానికి కౌన్సెలింగ్ నిర్వహించి, పిల్లలను తిరిగి పాఠశాలకు పంపించేలా చర్యలు తీసుకున్నారు.
*మహిళలు, బాలికలకు ఎస్పీ సూచనలు*
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ మాట్లాడుతూ మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే షీ టీమ్స్‌ను సంప్రదించాలని సూచించారు. విద్యార్థినులు తమ బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చదువుపై దృష్టి సారించాలని, ప్రతి ఒక్కరి భద్రత కోసం షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు.
విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో సివిల్ డ్రెస్‌లో కూడా పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారని, మహిళల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ప్రజల భద్రత పోలీసుల బాధ్యత అని, మహిళలు, పిల్లల రక్షణకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
*ఫిర్యాదుల కోసం సంప్రదించండి*
- షీ టీమ్: 8712659365
- AHTU టీమ్: 8712680066
- పోలీస్ అత్యవసర సహాయం: డయల్ 112
- చైల్డ్ హెల్ప్‌లైన్: 1098
మహిళలపై వేధింపులు, బాల కార్మికత్వం, బాల్యవివాహాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై సమాచారం ఉన్నవారు పై నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలిపారు.
మహిళల భద్రత – బాలల రక్షణ – నేరరహిత సమాజమే మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల లక్ష్యం.
Telangana
మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ నిరంతర నిఘా
Quick Summary:
మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ నిరంతర నిఘా