వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలి: రాష్ట్ర డీజీపీ గౌరవ శ్రీ సి.వి.ఆనంద్, ఐపీఎస్
విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర డీజీపీకి వివరించిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్
రానున్న వినాయక చవితి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ గౌరవ శ్రీ సి.వి.ఆనంద్, ఐపిఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు.
వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, మండపాల భద్రత, నిమజ్జన కార్యక్రమాల ఏర్పాట్లపై సోమవారం రాష్ట్ర డీజీపీ అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక చవితి ప్రారంభం నుంచి విగ్రహ నిమజ్జనం పూర్తయ్యే వరకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి చేపడుతున్న ముందస్తు చర్యలు, మండపాల వివరాలు, బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన ప్రదేశాల భద్రత తదితర అంశాలను రాష్ట్ర డీజీపీకి వివరించారు. జిల్లాలోని ప్రధాన మండపాలు, నిమజ్జన ప్రాంతాలను గుర్తించి భద్రతా పరంగా పరిశీలిస్తున్నామని, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. నిమజ్జనం రోజున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ఇరిగేషన్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు డీజీపీకి వివరించారు. అలాగే సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం, వదంతులు వ్యాప్తి చెందకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మండపాల వివరాలు పోలీస్ పోర్టల్‌లో నమోదు తప్పనిసరి
వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే మండపాల నిర్వాహకులు తమ మండపాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీస్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీజీపీ సూచించారు.
మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, నిర్వాహకుల పేర్లు, సంప్రదింపు నంబర్లు, విగ్రహానికి సంబంధించిన వివరాలు తదితర పూర్తి సమాచారాన్ని పోలీస్ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. దీనివల్ల ప్రతి మండపానికి సంబంధించిన సమాచారం పోలీస్ శాఖ వద్ద అందుబాటులో ఉండి, అవసరమైన సమయంలో సమన్వయం చేసుకోవడానికి, భద్రతా చర్యలు చేపట్టడానికి వీలవుతుందని పేర్కొన్నారు.
పోలీస్ పోర్టల్: http://policeportal.tspolice.gov.in
మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ సూచించే నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేయకుండా సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు.
మండపాల వద్ద భద్రతకు ప్రాధాన్యత
వినాయక మండపాల వద్ద విద్యుత్ వైర్లు, తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు, జనరేటర్లు తదితర అంశాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ సూచించారు. అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు.
మండపాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలని, మహిళలు, పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
వినాయక చవితి ఉత్సవాలు, ముఖ్యంగా నిమజ్జనం రోజున భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని డీజీపీ ఆదేశించారు.
ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాలు, నిమజ్జన మార్గాలను ముందుగానే గుర్తించి అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలని, వాహనదారులకు ముందస్తుగా సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
నిమజ్జన ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు
వినాయక నిమజ్జనం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున నిమజ్జన ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని డీజీపీ సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో రద్దీ నియంత్రణ, పార్కింగ్, వాహనాల రాకపోకలు, బ్యారికేడింగ్, లైటింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
నీటిలోకి వెళ్లే సమయంలో ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని నిమజ్జన కార్యక్రమాన్ని సురక్షితంగా నిర్వహించాలని సూచించారు.
సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా
ఉత్సవాల సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు, వదంతులు, రెచ్చగొట్టే సందేశాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని డీజీపీ సూచించారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని తెలిపారు.
ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలు పోలీసులకు సహకరించాలి
వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మండపాల నిర్వాహకులు, భక్తులు పోలీస్ శాఖ జారీ చేసే నిబంధనలు, సూచనలను పాటించి ఉత్సవాల విజయవంతమైన నిర్వహణకు సహకరించాలని కోరింది.
వినాయక చవితి ప్రారంభం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రతి దశలోనూ పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ అధికారులకు స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ ఎన్.బి. రత్నం, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, వర్టికల్ డీఎస్పీ బాలాజీ, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇజాజ్‌ఉద్దీన్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి, విమెన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కృష్ణయ్య, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్, అశోక్ కుమార్, ఐటీ సెల్ సబ్‌ఇన్‌స్పెక్టర్ రవి తదితర అధికారులు పాల్గొన్నారు.
Telangana
వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
Quick Summary:
వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
