బ్యానర్లపై ‘సేవకులు’... చేతల్లో మాత్రం కాలయాపన.!
జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై పాలమూరు టు ప్రజాభవన్ పాదయాత్ర
18 రోజుల దీక్షలు.. హామీలు ఎన్నో.. తాళాలు మాత్రం ఏవీ..?
అక్టోబర్ 10న ప్రజాభవన్‌కు జర్నలిస్టుల పాదయాత్ర
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 30: నవోదయం :
“మేము పాలకులం కాదు.. ప్రజల సేవకులం” అంటూ భారీ బ్యానర్లు కట్టుకుని ప్రచారం చేసుకోవడం ఒక ఎత్తయితే.. అదే సేవకుల పాలనలో ఏళ్ల తరబడి జర్నలిస్టుల ఇళ్ల సమస్య పరిష్కారం కాకపోవడం మరో ఎత్తు. మాటల్లో సేవ.. చేతల్లో జాప్యం అన్న చందంగా పరిస్థితి మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో సంవత్సరాలుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, అధికారుల తప్పిదాలను ప్రశ్నిస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న జర్నలిస్టులకే “పిచ్చుక గూడు” కరువైందని తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బండి విజయకుమార్, మంగళగిరి యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సాధన కోసం జర్నలిస్టులు గతంలో 18 రోజుల పాటు రిలే దీక్షలు నిర్వహించి రోడ్డెక్కారు. ఆ సమయంలో హామీల వర్షం కురిసింది. దీక్షా శిబిరానికి వచ్చి నిమ్మరసం ఇచ్చి, త్వరలోనే ఇళ్ల సమస్య పరిష్కరిస్తామని చెప్పిన మాటలు అప్పట్లో ఆశలు రేకెత్తించాయి. అయితే నెలలు గడుస్తున్నా ఆ హామీలకు కార్యరూపం కనిపించకపోవడంతో జర్నలిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
*“రేపు.. మాపు” అంటూ కాలం వెళ్లదీస్తారా.?*
గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు తాళాలు ఇవ్వడంలోనూ జాప్యం కొనసాగుతుండటంపై జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందించడానికి ఇంతకాలం ఎందుకు పడుతోంది.? అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లను కేటాయించడంలో ఉన్న అడ్డంకులు ఏమిటి.? వాటిని పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకున్న చర్యలేంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.
“ఇల్లు కట్టడం పూర్తి.. తలుపులు ఉన్నాయి.. తాళాలు ఉన్నాయి.. కానీ లబ్ధిదారుడి చేతిలో తాళంచెవి మాత్రం లేదు” అన్నట్లుగా పరిస్థితి మారిందని జర్నలిస్టులు మండిపడుతున్నారు.
ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే పాత్రికేయుల సమస్యలే పరిష్కారం కాకపోతే.. సాధారణ ప్రజల సమస్యల పరిష్కారం ఎలా జరుగుతుందనే ప్రశ్నను వారు సంధిస్తున్నారు.
*ప్రజాభవన్ బాట పట్టిన పాలమూరు పాత్రికేయులు*
హామీలు, వినతులు, ధర్నాలు, దీక్షలు.. ఇలా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నిసార్లు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించకపోవడంతో ఇక “పాలమూరు టు ప్రజాభవన్” పాదయాత్రకు సిద్ధమయ్యామని ఫెడరేషన్ సంఘ నాయకులు ప్రకటించారు.
అక్టోబర్ 10న జర్నలిస్టుల ఇళ్ల సమస్య సాధన కోసం ప్రజాభవన్‌కు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది కేవలం ఇళ్ల కోసం చేసే పాదయాత్ర మాత్రమే కాదని.. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాత్రికేయుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోరే పోరాటమని స్పష్టం చేశారు.
*అక్రిడిటేషన్ల జాప్యంపైనా నిరసన*
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ అక్టోబర్ 5న డీపీఆర్వో కార్యాలయం ఎదుట ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కమిటీ వెల్లడించింది.
అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ ఇవ్వాలని, అనవసర జాప్యానికి స్వస్తి పలకాలని సంఘం డిమాండ్ చేసింది. జర్నలిస్టులకు తాత్కాలిక ఉపశమన చర్యల కంటే శాశ్వత ప్రయోజనం కలిగించే సంక్షేమ పథకాలను అమలు చేయాలని తీర్మానించింది.
*అక్టోబర్ 6న అర్బన్ మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా!*
జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై అక్టోబర్ 6న స్థానిక అర్బన్ మండల కార్యాలయం ఎదుట ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బండ విజయకుమార్, మంగళగిరి యాదగిరి తెలిపారు.
“ప్రజల సమస్యలపై ప్రతిరోజూ వార్తలు రాసే జర్నలిస్టుల జీవితాల్లోనే సమస్యలు పేరుకుపోతే.. ఆ సమస్యలను ఎవరు రాయాలి? ఎవరు పరిష్కరించాలి?” అని వారు ప్రశ్నించారు.
*సేవకులమనే మాటలకు కార్యరూపం ఎప్పుడు.?*
బ్యానర్లపై “సేవకులు” అని రాసుకోవడం కంటే.. బాధితుల తలుపు తట్టి వారి సమస్యను పరిష్కరించడమే నిజమైన ప్రజాసేవ అని జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు.
“మాట ఇచ్చారు.. దీక్షకు వచ్చారు.. నిమ్మరసం తాగించారు.. నెల రోజుల్లో ఇళ్లు అన్నారు.. ఎన్వోసీ లు ఇస్తామన్నారు కానీ నెలలు గడిచినా పట్టా కాగితాలు లేవు, తాళాలు మాత్రం రాలేదు” అనే పరిస్థితి ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ప్రభుత్వం మారింది.. పాలకులు మారారు.. కానీ జర్నలిస్టుల ఇళ్ల సమస్య మాత్రం మారలేదు. “కాలయాపనకు కూడా ఒక హద్దుంటుంది.. హామీకి కూడా ఒక గడువు ఉంటుంది” అని జర్నలిస్టు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల సమస్యకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి. లేదంటే పాలమూరు నుంచి ప్రజాభవన్ వరకు సాగనున్న పాదయాత్ర ప్రభుత్వానికి మరోసారి “హామీలకు కాదు.. అమలుకు సమయం వచ్చింది” అనే సందేశాన్ని ఇవ్వనుంది.
ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గండీటి. నరసింహ, జిల్లా కార్యదర్శి మెలకలపల్లి గోపాల్ మహారాజ్, జాతీయ కమిటీ సభ్యులు పసుపుల శ్రీనివాస్,ఎం.డి. మోయిజ్, జిల్లా సహాయ కార్యదర్శి కోడి సుకుమార్, సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఎస్. గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.కే. శ్రీనివాస్, ఎం. దాసు, వేణుగోపాల్ గౌడ్, శ్యాముల్ సుందరాచారి, రామకృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి లింగగళ్ల నరసింహులు, సమీ, అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
బ్యానర్లపై ‘సేవకులు’... చేతల్లో మాత్రం కాలయాపన.! జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై పాలమూరు టు ప్రజాభవన్ పాదయాత్ర
Quick Summary:
బ్యానర్లపై ‘సేవకులు’... చేతల్లో మాత్రం కాలయాపన.! జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై పాలమూరు టు ప్రజాభవన్ పాదయాత్ర

