గిగ్ కార్మికులకు కార్మిక హోదా కల్పించి సామాజిక భద్రత కల్పించాలి
కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం సమగ్ర చట్టం తీసుకురావాలి: సీఐటీయూ
మేడ్చల్–మల్కాజ్‌గిరి ప్రతినిధి, సెప్టెంబర్ 8 (నవోదయం):
గిగ్ కార్మికులకు కార్మిక హోదా కల్పించడంతో పాటు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతా హక్కులు కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని సీఐటీయూ డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా సీఐటీయూ మేడ్చల్ జిల్లా వర్కర్ కన్వీనర్ మణికంఠ, జిల్లా కో-కన్వీనర్ రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఉబర్, ఓలా, రాపిడో, బిగ్‌బాస్కెట్ తదితర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ సంస్థల్లో లక్షలాది మంది యువత గిగ్ కార్మికులుగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రత వంటి ప్రాథమిక హక్కులు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
టార్గెట్లు, రేటింగ్‌లు, ఇన్సెంటివ్‌లు, పెనాల్టీల పేరుతో గిగ్ కార్మికులపై కంపెనీలు తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయని వారు పేర్కొన్నారు. సరైన విచారణ, వివరణకు అవకాశం లేకుండానే యాప్ ఐడీలను బ్లాక్ చేయడం వల్ల అనేక మంది కార్మికులు ఒక్కసారిగా ఉపాధిని కోల్పోతున్నారని తెలిపారు.
పని సమయంలో రోడ్డు ప్రమాదాలకు గురైన గిగ్ కార్మికులకు సరైన వైద్య సహాయం, ప్రమాద బీమా, పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ESI, PF, పెన్షన్, గ్రాట్యుటీ వంటి సామాజిక భద్రతా హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. డెలివరీ టార్గెట్లను పూర్తి చేయాలనే ఒత్తిడితో వేగంగా ప్రయాణించాల్సి రావడం వల్ల కార్మికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా గిగ్ కార్మికుల కోసం ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని, పని సమయంలో వారి రక్షణకు ప్రభుత్వం, సంబంధిత కంపెనీలు బాధ్యత వహించాలని సీఐటీయూ నాయకులు కోరారు. యాప్ ఆధారిత రేటింగ్ విధానం, చెల్లింపులు, ఇన్సెంటివ్‌లు, పెనాల్టీల విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.
గిగ్ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే గుర్తించి వారి హక్కులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని కోరారు. కంపెనీలు భారీ లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ, ఆ లాభాల వెనుక శ్రమిస్తున్న కార్మికులకు కనీస హక్కులు కూడా లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.
“గిగ్ వర్కర్లు కేవలం యాప్ పార్ట్‌నర్లు కాదు.. వారు కార్మికులు. వారికి కార్మిక హక్కులు, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలి” అని సీఐటీయూ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ యంగ్ వర్కర్ నాయకులు పి. భాస్కర్, తిరుపతి, శ్రీను, రాంబాబు, పి. స్వామితో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.
Telangana
గిగ్ కార్మికులకు కార్మిక హోదా కల్పించి సామాజిక భద్రత కల్పించాలి
Quick Summary:
గిగ్ కార్మికులకు కార్మిక హోదా కల్పించి సామాజిక భద్రత కల్పించాలి
