విద్యార్థుల భవిష్యత్తుకు రూ.42 లక్షల అండ
కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు కంప్యూటర్ ల్యాబ్ అందించిన విద్యా సేవకుడు వై.వి. గోపాలకృష్ణమూర్తి
కోస్గి/ నవోదయం ప్రత్యేకం:
చదువుకోవాలనే తపన ఉన్నా ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారిన విద్యార్థులకు అండగా నిలవడం.. ఉన్నత విద్యను అభ్యసించినా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు సరైన మార్గదర్శకత్వం అందించడం.. వేలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం.. ఇవన్నీ తన సామాజిక బాధ్యతగా భావిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న విద్యావేత్త, విద్యా సేవకుడు, సంఘ సేవకుడు వై.వి. గోపాలకృష్ణమూర్తి.
కోస్గి పట్టణంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల కోసం ఆయన అందించిన సేవ ప్రస్తుతం ప్రత్యేకంగా నిలిచింది. కళాశాలలో కంప్యూటర్, ఇంజనీరింగ్ విద్యార్థుల ల్యాబ్ ఏర్పాటుకు తన సొంత నిధుల నుంచి సుమారు రూ.42 లక్షల విలువైన కంప్యూటర్లు, ల్యాబ్ సామాగ్రిని అందించారు. ఈ సహకారం వందలాది మంది విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎంతో ఉపయోగపడనుంది.
ఘనంగా కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
ఈ నెల 8న కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల తిరుపతిరెడ్డి, కాడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్‌కుమార్, స్థానిక మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్ తదితర ప్రజాప్రతినిధులు, కళాశాల సిబ్బంది, విద్యార్థుల సమక్షంలో ల్యాబ్‌ను ప్రారంభించారు.
విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఆధునిక సాంకేతిక సదుపాయాలను అందించడంలో గోపాలకృష్ణమూర్తి చూపిన చొరవను పలువురు అభినందించారు.
హైదరాబాద్‌లోని ఘట్కేసర్ సమీపంలో ఉన్న ఏస్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్‌గా, దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఏస్ గేట్ కోచింగ్ సెంటర్ అధినేతగా వై.వి. గోపాలకృష్ణమూర్తి విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్నారు.
ఆయన ఆధ్వర్యంలో శిక్షణ పొందిన అనేక మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలను సాధించారు. విద్యార్థులకు కేవలం కోచింగ్ ఇవ్వడమే కాకుండా, వారి సామర్థ్యాన్ని గుర్తించి సరైన సలహాలు, మార్గదర్శకత్వం అందిస్తూ నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయనను అభిమానించే వారు చెబుతున్నారు.
కోస్గిపై ప్రత్యేక అభిమానం
వై.వి. గోపాలకృష్ణమూర్తికి కోస్గి పట్టణంతో 2005 సంవత్సరం నుంచి పరిచయం ఉందని వివేకానంద సామాజిక సేవా సంస్థ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, కోస్గి వాస్తవ్యుడు జి. హనుమంతు తెలిపారు. కోస్గి పట్టణంపై ఉన్న ప్రత్యేక అభిమానం, ఇక్కడి విద్యార్థులపై ఉన్న మమకారంతోనే ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు ఇంత పెద్ద మొత్తంలో సహకారం అందించారని పేర్కొన్నారు.
కళాశాలలో జరిగిన కార్యక్రమం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని గోపాలకృష్ణమూర్తి హనుమంతుతో ఫోన్‌లో సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. తనను ఎంతో గౌరవంగా సత్కరించిన కొడంగల్ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్‌కుమార్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపినట్లు హనుమంతు వెల్లడించారు.
“విద్యార్థుల విజయమే నాకు నిజమైన సంతోషం”
తన విద్యా సంస్థల్లో కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కార్యక్రమానికి వచ్చి తనపై అభిమానాన్ని చూపడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని గోపాలకృష్ణమూర్తి పేర్కొన్నట్లు హనుమంతు తెలిపారు.
భవిష్యత్తులో అవకాశం లభించినప్పుడల్లా కోస్గి విద్యార్థులకు తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు.
కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గోపాలకృష్ణమూర్తిని సంప్రదించేందుకు గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ అపాయింట్‌మెంట్ పొందడం సాధ్యం కాలేదని, అలాంటి విద్యావేత్తను హనుమంతు పరిచయం చేయడం తమ కళాశాలకు, వందలాది మంది విద్యార్థులకు గొప్ప వరమని సంతోషం వ్యక్తం చేసినట్లు హనుమంతు తెలిపారు.
విద్యారంగంలో నిరంతరం సేవలందిస్తున్న వై.వి. గోపాలకృష్ణమూర్తి వంటి వ్యక్తులను ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, విద్యావంతులు స్ఫూర్తిగా తీసుకోవాలని హనుమంతు కోరారు.
కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు, గతంలో ఏస్ గేట్ లో శిక్షణ పొందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆయన చేసిన సేవలను ఎప్పటికీ మరువకూడదని అన్నారు. నిత్యం దాదాపు 18 గంటల పాటు విద్యా వ్యవస్థకు సంబంధించిన కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ, కోస్గిపై అభిమానంతో ఇక్కడి విద్యార్థులకు సేవ చేయడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.
“ఇలాంటి విద్యా సేవకులను ప్రోత్సహించి, వారికి అన్ని విధాలుగా సహకరించాలి. వారి సేవలు మరింత మంది విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగునివ్వాలి” అని హనుమంతు ఆకాంక్షించారు.
— జి. హనుమంతు
వై.వి. గోపాలకృష్ణమూర్తి అభిమాని
వివేకానంద సామాజిక సేవా సంస్థ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
షిర్డీ సాయి మందిరం కార్యదర్శి, కోస్గి
Education
కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు కంప్యూటర్ ల్యాబ్ అందించిన విద్యా సేవకుడు వై.వి. గోపాలకృష్ణమూర్తి
Quick Summary:
కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు కంప్యూటర్ ల్యాబ్ అందించిన విద్యా సేవకుడు వై.వి. గోపాలకృష్ణమూర్తి

